"" vijayavahini: Vijayawada city name history | విజయభూమి ఇంద్రకీలాద్రి

Tuesday, October 2, 2018

Vijayawada city name history | విజయభూమి ఇంద్రకీలాద్రి


Vijayawada city name


 అంధ్రప్రదేశ్ లో రెండో అతి పెద్ద నగరంగా పేరుపడిన విజయవాడ ఆధ్యాత్మికతకే కాదు, ప్రకృతి అందాలకూ నెలవే. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి పేరుతో వెలసిన ఈ చారిత్రక నగరం  ‘బెజవాడ’గానూ ప్రసిద్ధిచెందింది. 

ఒక వైపు గలగల పారే కృష్ణమ్మ.. మరోవైపు పర్వత శ్రేణులతో పర్యటకులను ఆకట్టుకునే విజయవాడ నగరం దేశంలోనే ఒక ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఆకట్టుకుంటోంది. చదువుల తల్లికి పుట్టినిల్లుగా పిలిచే విజయవాడ  నగరాన్ని విద్యలవాడ అని కూడా అంటారు. ఇవేకాదు, మరెన్నో ప్రత్యేకతలను కలిగిన నగరం విజయవాడ. విజయవాడ, బెజవాడ, విజయవాటిక,ఇలా వివిధ పేర్లతో పిలుచుకునే విజయవాడకు ఆ పేర్లెలా వచ్చాయో చూద్దాం.....

విజయవాడకు ఆ పేరు ఎలా వచ్చింది?: 
విజయవాడను ఒరిస్సా గజపతుల నుంచి 19 వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు, విజయనగర సామ్రాజ్య రాజు కృష్ణదేవరాయల వరకు అనేక రాజవంశీయులు పాలించారు.
ఇక్కడి ఇంద్రకీలాద్రి పర్వతం మీదే పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసి, శివునితో యుద్ధం చేసిన అర్జునుడుకి శివుని పాశుపతాస్త్రముతో పాటు, శివుని ఆశీస్సులు లభించాయని పురాణ కథనాలు చెప్తున్నాయి. పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు, వేదవ్యాసుడు వారిని కలిసి, వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. దాంతో అంతటి మహత్కార్యం సాధించడం ఆర్జునుడికే సాధ్యమవుతుందని ఆ పనికి అర్జునుణ్ణి పంపిస్తారు. దాంతో  అర్జునుడు ఇంద్రకీల పర్వతముపై  ఒంటికాలిపై, పంచాగ్నుల మధ్య ఘోరమయిన తపస్సు చేసాడు.  అర్జునుడి భక్తికి మెచ్చిన శివుడు అర్జునుణ్ణి పరీక్షించాలని వేటగాని రూపము ధరించి ఒక అడవిపందిని తరుముకుంటూ వస్తాడు. 
Vijayawada indrakeeladri
ఇంతలో ఆ అడవిపంది అర్జునుడి వైపు వస్తుంది. అర్జునుడు వెంటనే ఆ అడవిపంది మీద బాణం వేస్తాడు. అదే సమయములో వేటగాని రూపములో ఉన్న శివుడు కూడా బాణము విసిరుతాడు. ఈ రెండు బాణములు ఒకేసారి తగిలి, అడవిపంది  మరణిస్తుంది. దానిని చంపింది తానంటే తానేనని ఇద్దరూ తగువుకి దిగుతారు. మాటలు కాస్తా యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎంత గొప్పవీరుడయినా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా ఆలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును తయారు చేసి పూజిస్తాడు. అర్జునుడు శివలింగము మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుంటాయి. ఇది గమనించిన అర్జునుడు వేటగాడిగా వచ్చింది  సాక్షాత్తూ శివుడేనని తెలుసుకుంటాడు. అప్పుడు శివుడు తన స్వస్వరూపంలో ప్రత్యక్షమై, అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా అర్జునుడు ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించాడని ప్రతీతి. అలాగే, కనకదుర్గ అమ్మవారు ఇక్కడే మహిషుడనే రాక్షసుణ్ణి సంహకరించిన తర్వాత ఇంద్రకీలాద్రి మీద విశ్రాంతి తీసుకున్నారని చెబుతుంటారు. అందుకే విజయాన్నిచ్చిన ఈ ప్రాంతాన్ని అమ్మవారి పేరు మీదుగా  ‘విజయభూమి’ అని విజయవాటిక అని, విజయవాడ అని  పిలిచేవారట.
Vijayawada city view

ఈ నగరాన్ని  బెజవాడ’ అని కూడా అంటారు. మధ్య యుగంలో ఒడిశాకు చెందిన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఒడియా, బెంగాళీ ప్రజలు ‘వ’ను ‘బ’ అని పలుకుతారు. ఆ కారణంగానే వారు విజయవాడను  బిజయవాడ’ అని పిలిచేవారట.. దీంతో ‘బిజయవాడ’ క్రమేనా బిజవాడబెజవాడ అని మారింది. ఇలా 400 ఏళ్ల వరకు ఈ పేరుతోనే పిలిచారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మళ్లీ ఈ నగరాన్ని ‘విజయవాడ’గా మార్చారని చెప్తారు. కొంతమంది ‘బెజ్జంవాడ’ కాస్తా బెజవాడగా మారిందని, మరికొందరు విజయవాడలో వేడి వాతావరణం వల్ల బ్రిటీష్ వారు ‘బ్లేజ్‌వాడ’ అని పేరు పెట్టారని అది క్రమేనా బెజవాడగా మారిందని చెబుతుంటారు. విజయవాడ నగర శివారు ప్రాంతాలైన భవానీపురం, విద్యాధరపురం, కబేళా పరిసర ప్రాంత వాసులు అతి తక్కువ సమయంలో నగరంలోకి రావడానికి ఉన్న ఏకైక మార్గం సొరంగం. 60వ దశకంలో నిర్మాణమైన ఈ సొరంగ మార్గం...అప్పట్లో విజయవాడకు బెజవాడ అనే పేరు రావడానికి ఈ సొరంగమే కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ సొరంగం పూర్తయ్యే నాటికి విజయవాడలో అక్షరాస్యుల శాతం చాలా తక్కువని...గ్రామీణుల రాకపోకలు ఎక్కువగా ఉండేవని చెబుతారు. దీంతో గ్రామీణులు అప్పట్లో ఈ సొరంగాన్ని బెజ్జంగా వ్యవహరించేవారు. బెజ్జం ఉన్న ఊరు కాబట్టి విజయవాడ కాస్తా...బెజ్జంవాడగా...కాలక్రమంలో బెజవాడగా ప్రసిద్ధి చెందిందనే మరో వాదన కూడా వినబడుతుంది.
ఇవి విజయవాడ పేరుకి సంబంధించిన కథనాలు.

No comments:

Post a Comment